రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలు మారింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్ కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్‌ను ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్‌ను (ఇంజనీరింగ్) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.
4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.